ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభం
  • ప్రారంభించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు

నిర్మల్/ఆసిఫాబాద్/లక్సెట్టిపేట/జైపూర్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉత్తమ విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని కలెక్టర్లు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ల్యాబ్​లను ప్రారంభించారు. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలోని ప్రైమరీ స్కూల్​లో, జైపూర్ మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్​లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబులను కలెక్టర్ కుమార్ దీపక్.. ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​తో కలిసి ప్రారంభించారు.

నేటి విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథ ఎంతో అవసరమని, ఏఐ ద్వారా విద్యార్థుల్లో సంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. డీఈవో యాదయ్య, హెచ్ఎం హెలెన్ డారతి తదితరులు పాల్గొన్నారు. ఏఐ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా సూచించారు.  ఆదిలాబాద్ రూరల్ మండలం తాటిగూడ  ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో ఏఐ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం మొదట 6 జిల్లాల్లో ఏఐ ఆధారిత ఆన్​లైన్ లెర్నింగ్ ప్రాసెస్​ను ప్రారంభించిందన్నారు. డీఈఓ ప్రణీత, ఎంఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ ​జిల్లాలో 16 స్కూళ్లలో ల్యాబ్​లు

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాభోదన చేసేలా రాష్ట్ర​ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం మేడిపల్లి హైస్కూల్​లో అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్​తో కలిసి ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్​ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రాజెక్టులో భాగంగా నిర్మల్ జిల్లాలో 16 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్​లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డీఈవో పి.రామారావు, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలం తక్కల్లపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్​లో ఏఐ ద్వారా టెన్త్​ విద్యార్థులకు బోధన అందించే కంప్యూటర్లను కలెక్టర్​ వెంకటేశ్​ధోత్రే ప్రారంభించారు.

జిల్లాలో తొలి విడతగా 4 స్కూళ్లలో ఏఐ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భాష, గణిత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎంతో దోహదపడుతుందన్నారు. తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.